Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › జెకర్యా › 6

IRV · అధ్యాయం 6 / 14

జెకర్యా 6

1నేను మళ్ళీ తేరిచూడగా రెండు పర్వతాల మధ్య నుండి నాలుగు రథాలు బయలుదేరుతున్నాయి. ఆ పర్వతాలు ఇత్తడివి.

2మొదటి రథానికి ఎర్రని గుర్రాలు, రెండవ రథానికి నల్లని గుర్రాలు,

3మూడవ రథానికి తెల్లని గుర్రాలు, నాలుగవ రథానికి చుక్కలు చుక్కలుగల బలమైన గుర్రాలు పూన్చి ఉన్నాయి.

4“స్వామీ, ఇవేమిటి?” అని నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను.

5అతడు నాతో ఇలా అన్నాడు. “ఇవి సర్వలోకనాధుడైన యెహోవా సన్నిధిని విడిచి బయలు దేరే ఆకాశపు నాలుగు గాలులు.

6నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశంలోకి పోయేది. తెల్లని గుర్రాలున్న రథం వాటి వెంబడి పోతుంది, చుక్కలు చుక్కల గుర్రాలు గల రథం దక్షిణ దేశంలోకి పోతుంది.”

7బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతట సంచరించడానికి సిద్ధంగా ఉండగా “పోయి లోక మంతటా సంచరించండి” అని అతడు చెప్పాడు. అప్పుడు అవి లోకమంతా సంచరించాయి.

8అప్పుడతడు నన్ను పిలిచి “ఉత్తరదేశంలోకి పోయే వాటిని చూడు. అవి ఉత్తరదేశంలో నా ఆత్మకు విశ్రాంతి కలిగిస్తాయి” అని నాతో అన్నాడు.

9యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే

10చెరలోకి పోయిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబీయా, యెదాయా, అనేవారు జెఫన్యా కుమారుడు యోషీయా ఇంట్లో దిగారు. వారు చేరిన దినాన్నే నీవు ఆ ఇంటికి పోయి

11వారినడిగి వెండి బంగారాలు తీసుకుని, కిరీటం చేసి ప్రధాన యాజకుడు, యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ తల మీద ఉంచి

12అతనితో ఇలా చెప్పు. “సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, చిగురు అనే ఒకడు ఉన్నాడు. అతడు తన స్థలంలో నుండి చిగురిస్తాడు. అతడు యెహోవా ఆలయం కడతాడు.

13అతడే యెహోవా ఆలయం కడతాడు. అతడు ఘనత వహించి సింహాసనాసీనుడై పరిపాలిస్తాడు. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ యిద్దరికీ సమాధానకరమైన ఆలోచనలు కలుగుతాయి.

14ఆ కిరీటం యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థంగా ఉంటుంది. హేలెముకు, టోబీయాకు, యెదాయాకు, జెఫన్యా కుమారుడు హేనుకు స్మారక చిహ్నంగా ఉంటుంది.

15దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయాన్ని కడతారు, అప్పుడు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకుంటారు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా వింటే ఇలా జరుగుతుంది.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org