Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › హోషేయ › 8

IRV · అధ్యాయం 8 / 14

హోషేయ 8

1“బాకా నీ నోట ఉంచుకో. ప్రజలు నా నిబంధన అతిక్రమించారు. నా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు. కాబట్టి యెహోవానైన నా ఇంటి మీద వాలడానికి గద్ద వస్తూ ఉంది అని ప్రకటించు.”

2వారు నాకు మొర్రపెడతారు. “మా దేవా, ఇశ్రాయేలు వారమైన మేము నిన్ను ఎరిగిన వారమే.”

3కానీ ఇశ్రాయేలీయులు సన్మార్గమును విసర్జించారు. కాబట్టి శత్రువు వారిని తరుముతాడు.

4వారు రాజులను నియమించుకున్నారు. కానీ నేను వారిని నియమించలేదు. వారు అధికారులను పెట్టుకున్నారు. కానీ వారెవరూ నాకు తెలియదు. తమ వెండి బంగారాలతో తమ కోసం విగ్రహాలు చేసుకున్నారు. కానీ అదంతా వారు నాశనమై పోవడానికే.

5ప్రవక్త ఇలా అంటున్నాడు “షోమ్రోనూ, ఆయన నీ దూడను విసిరి పారేశాడు.” యెహోవా ఇలా అంటున్నాడు. నా కోపం ఈ ప్రజల మీద మండుతూ ఉంది. ఎంత కాలం వారు అపవిత్రంగా ఉంటారు?

6ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? కంసాలి దాన్ని తయారు చేశాడు. అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది.

7ప్రజలు గాలిని విత్తనాలుగా చల్లారు. పెనుగాలిని వారు కోసుకుంటారు. కనిపించే పైరులో కంకులు లేవు. దాన్ని గానుగలో వేస్తే పిండి రాదు. ఒకవేళ పంట పండినా విదేశీయులు దాన్ని కోసుకుంటారు.

8ఇశ్రాయేలు వారిని శత్రువులు కబళిస్తారు. ఎవరికీ ఇష్టంలేని ఓటికుండల్లా వారు అన్యజనుల్లో చెదిరి ఉంటారు.

9వారు ఒంటరి అడవి గాడిదలాగా అష్షూరీయుల దగ్గరికి పోయారు. ఎఫ్రాయిము తన కోసం విటులను డబ్బిచ్చి పిలిపించుకుంది.

10వారు కానుకలు ఇచ్చి అన్యజనాల్లో విటులను పిలుచుకున్నా ఇప్పుడే నేను వారిని సమకూరుస్తాను. చక్రవర్తి పీడన పెట్టే బాధ కింద వారు కృశించి పోతారు.

11ఎఫ్రాయిము పాపపరిహారం కోసం ఎన్నెన్నో బలిపీఠాలను కట్టింది. కానీ అతడు పాపం చేయడానికి అవే దోహదం చేశాయి.

12నేను పదివేల సార్లు అతని కోసం నా ధర్మశాస్త్రాన్ని రాయించి నియమించినా, అయినా దాన్ని ఎప్పుడూ చూడనట్టుగా అతడు ఉంటాడు.

13నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే, వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాటి బలులను నేను, అంటే యెహోవాను అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది.

14ఇశ్రాయేలువారు తమ సృష్టికర్త అయిన దేవుని మర్చి పోయారు. తమ కోసం భవనాలు కట్టించుకున్నారు. యూదావారు, చాలా పట్టణాలకు కోటలు కట్టుకున్నారు. అయితే నేను వారి పట్టణాలను తగలబెడతాను. వారి కోటలను ధ్వంసం చేస్తాను.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org