Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › ఎజ్రా › 5

IRV · అధ్యాయం 5 / 10

ఎజ్రా 5

1హగ్గయి ప్రవక్త, ఇద్దో కొడుకూ ప్రవక్తా అయిన జెకర్యా, యూదా దేశంలో, యెరూషలేములో ఉంటున్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రకటించారు.

2షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవ ఇద్దరూ బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి సహాయం చేస్తూ వచ్చారు.

3అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి, వారితోబాటు మరికొందరు, యూదుల దగ్గరికి వచ్చారు. వారు “ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు.

4దాన్ని నిర్మిస్తున్న వారి పేర్లు, ఇతర విషయాలు కూడా వాళ్ళు అడిగారు.

5అయితే యూదుల దేవుడు వారిపై తన కాపుదల ఉంచడం వలన ఈ విషయంలో చక్రవర్తి దర్యావేషు నుండి అనుమతి వచ్చేవరకూ అధికారులు కట్టడం పని జరగకుండా అడ్డుకోలేదు.

6నది ఇవతల అధికారులైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారితో ఉన్న ఇతర అధికారులు చక్రవర్తి దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ప్రతి ఇది.

7“రాజైన దర్యావేషుకు సమస్త క్షేమ సుఖాలు కలుగు గాక.

8రాజువైన మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటంటే, మేము మహా దేవుని మందిరం ఉన్న యూదుల ప్రాంతానికి వెళ్ళాం. దాన్ని పెద్ద పెద్ద రాళ్లతో కడుతూ ఉన్నారు. గోడల మధ్యలో స్థంభాలు వేస్తున్నారు. ఈ పని త్వరత్వరగా కొనసాగుతూ పూర్తి కావస్తున్నది.

9‘ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?’ అని అక్కడున్న పెద్దలను మేము అడిగాం.

10మీకు తెలియజేయడం కోసం అజమాయిషీ చేస్తున్న అధికారుల పేర్లు వ్రాసి ఇమ్మని కూడా అడిగాం.

11దానికి వారు ఇలా జవాబిచ్చారు, భూమి, ఆకాశాలకు దేవుడైన వాడికి సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలీయుల్లో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాం.

12మా పూర్వీకులు ఆకాశంలో నివాసముండే దేవునికి కోపం పుట్టించినందువల్ల ఆయన వారిని కల్దీయుడైన బబులోను రాజు నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బబులోను దేశానికి బందీలుగా తీసుకువెళ్ళాడు.

13అయితే బబులోను రాజు కోరెషు తన పాలన మొదటి సంవత్సరంలో దేవుని మందిరం తిరిగి కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు.

14అంతే కాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామగ్రిని రాజైన కోరెషు ఆ గుడిలో నుండి తెప్పించాడు.

15షేష్బజ్జరును గవర్నరుగా నియమించి దేవుని మందిరాన్ని అది ఉన్న స్థలం లో కట్టించి, ఆ సామగ్రిని తీసుకువెళ్ళి యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో ఉంచే బాధ్యతలు అతనికి అప్పగించాడు.

16కాబట్టి షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోని దేవుని మందిరం పునాది వేయించాడు. అప్పటినుండి నేటివరకూ దాన్ని కడుతూ ఉన్నాము. పని ఇంకా పూర్తి కాలేదు.

17కాబట్టి చక్రవర్తికి ఇష్టమైతే బబులోను పట్టణంలో ఉన్న రాజుకు చెందిన ఖజానాలో వెతికించి, యెరూషలేములో ఉన్న దేవుని మందిరాన్ని కట్టించాలని కోరెషు రాజు నిర్ణయించాడో లేదో తెలుసుకోవచ్చు. అప్పుడు చక్రవర్తి ఈ విషయంలో తన నిర్ణయం తెలియజేయాలని కోరుకొంటున్నాం.”

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org