బైబిల్ › 2 కొరింతీ పత్రిక › 3
IRV · అధ్యాయం 3 / 13
2 కొరింతీ పత్రిక 3
1మళ్ళీ మా గురించి మేము గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టామా? కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా?
2మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు.
3అది రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు
4క్రీస్తు ద్వారా దేవుని మీద మాకిలాంటి నమ్మకముంది.
5మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది.
6ఆయనే కొత్త ఒడంబడికకు సేవకులుగా మాకు అర్హత కలిగించాడు. అంటే వ్రాత రూపంలో ఉన్న దానికి కాదు, ఆత్మ మూలమైన దానికే. ఎందుకంటే అక్షరం చంపుతుంది గానీ ఆత్మ బ్రతికిస్తుంది.
7మరణ కారణమైన సేవ, రాళ్ల మీద చెక్కిన అక్షరాలకు సంబంధించినదైనా, ఎంతో గొప్పగా ఉంది. అందుకే మోషే ముఖ ప్రకాశం తగ్గిపోతున్నా సరే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు.
8ఇలాగైతే ఆత్మ సంబంధమైన సేవ మరింకెంత గొప్పగా ఉంటుందో గదా!
9శిక్షా విధికి కారణమైన సేవ ఇంత గొప్పగా ఉంటే, నీతికి కారణమైన సేవ మరింకెంతో గొప్పగా ఉంటుంది గదా!
10అపారమైన వైభవం దీనికి ఉండడం వలన ఒకప్పుడు వైభవంగా ఉండేది, ఇప్పుడు వైభవం లేనిదయింది.
11గతించి పోయేదే గొప్పగా ఉంటే, ఎప్పటికీ ఉండేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
12తగ్గిపోయే వైభవాన్ని ఇశ్రాయేలీయులు నేరుగా చూడకుండా మోషే తన ముఖం మీద ముసుకు వేసుకున్నాడు. మేము మోషేలాంటి వాళ్ళం కాదు
13మాకెంతో భరోసా ఉంది కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాము.
14అయితే వారి మనసులు మూసుకు పోయాయి. ఇప్పటి వరకూ వారు పాత ఒడంబడిక చదివేటప్పుడు ఆ ముసుకు అలానే ఉంది. ఎందుకంటే కేవలం క్రీస్తులో దేవుడు దాన్ని తీసివేశాడు.
15అయితే ఇప్పటికీ వారు మోషే గ్రంథాన్ని చదివే ప్రతిసారీ వారి హృదయాల మీద ముసుకు ఇంకా ఉంది గాని
16వారు ఎప్పుడు ప్రభువు వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు ఆ ముసుకు తీసివేస్తాడు.
17ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.
18మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవపు పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మ అయిన ప్రభువు ద్వారా జరుగుతున్నది.
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org